Home Celebrity 14 ఏళ్లయినా అదే ముద్రా?

14 ఏళ్లయినా అదే ముద్రా?

నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?
‘మాజీ భార్య’ ట్యాగ్‌పై రేణు దేశాయ్‌ ఆవేదన.


ఒక సినిమా పరిచయం.. ఒక ప్రేమకథ.. ఒక వివాహం.. ఆ తర్వాత విడాకులు! అంతేనా ఒక మహిళ జీవితానికి ఉన్న గుర్తింపు? ఆమెకంటూ ఒక గతం ఉండకూడదా? ప్రతిభ, అభిరుచులు, విజయాలు, స్వతంత్ర ప్రయాణం ఉండకూడదా? విడాకులు తీసుకుని 14 ఏళ్లు గడిచినా, ఇంకా ‘మాజీ భార్య’ అనే ముద్రను మోస్తూనే ఉండాలా? ప్రముఖ నటి, నిర్మాత రేణు దేశాయ్‌ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీశాయి. ‘బద్రి’ సినిమాకు ముందు తనకంటూ జీవితమే లేనట్లు కొందరు వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరాముడి వనవాసం 14 ఏళ్లకే ముగిసింది.. మరి తన గుర్తింపు కోసం సాగుతున్న ఈ వనవాసానికి ముగింపు ఎప్పుడు? అంటూ ప్రశ్నించారు. ఆమె మాటల్లో ఆవేదన మాత్రమే కాదు.. తనను ఒక వ్యక్తిగా గుర్తించాలనే బలమైన ఆకాంక్ష కనిపిస్తోంది.


14 ఏళ్లయినా అదే గుర్తింపా?

ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో రేణు దేశాయ్‌ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వ్యాఖ్యలు, ట్రోలింగ్‌ గురించి మాట్లాడారు. తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది తన జీవితాన్ని ‘బద్రి’ సినిమాతోనే మొదలైనట్లు చూస్తున్నారని, అంతకుముందు తనకంటూ జీవితం లేనట్లుగా భావిస్తున్నారని అన్నారు. 2012లో విడాకులు పూర్తయినా, ఇప్పటికీ పవన్‌ కళ్యాణ్ మాజీ భార్యగానే తనను పరిచయం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక బంధం ముగిసినంత మాత్రాన ఒక వ్యక్తి గుర్తింపు కూడా ముగిసిపోతుందా? జీవితాంతం అదే ట్యాగ్‌ను తగిలించుకుని తిరగాలా? అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ప్రతిభకు గుర్తింపు లేదా?

విడాకుల తర్వాత తాను ఖాళీగా కూర్చోలేదని రేణు వివరించారు. సొంతంగా మరాఠీ సినిమాను నిర్మించి విజయం సాధించానని, మరో చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వహించానని తెలిపారు. టీవీ డ్యాన్స్‌ షోల్లో పనిచేశానని, కవితలు రాశానని, ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. ఇన్ని రంగాల్లో పనిచేసి తనకంటూ ఒక ప్రయాణాన్ని నిర్మించుకున్నా, వ్యక్తిగత ప్రతిభను పక్కనపెట్టి పాత బంధంతోనే ఎందుకు కొలుస్తున్నారని ప్రశ్నించారు. తనకు స్వతంత్ర గుర్తింపు లేదన్నట్లు మాట్లాడేవారు, ఇతరుల జీవితాలపై తీర్పులు చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. ఒక మహిళను ఆమె గత బంధంతో కాకుండా, ఆమె ప్రతిభతో, పనితో, వ్యక్తిత్వంతో గుర్తించాలన్నదే రేణు దేశాయ్‌ మాటల్లోని ప్రధాన సందేశం.

 

#RenuDesai #PawanKalyan #RenuDesaiInterview #ExWifeTag #WomenIdentity #TeluguCinema #TollywoodNews #RenuDesaiLatestNews #WomenEmpowerment #FilmProducer #CelebrityNews