2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం.
పరిశోధనల నుంచి ప్రజలకు ఉపయోగపడేలా ఉత్పత్తులు.
ఆవిష్కరణలకు ప్రభుత్వ అండ, ప్రోత్సాహం: భట్టి విక్రమార్క.
తెలంగాణను ప్రపంచస్థాయి సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఉత్పత్తులు, సేవలుగా మారాలని ఆకాంక్షించారు. ఇందుకోసం పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో బుధవారం నిర్వహించిన ఫిక్కీ శతాబ్ది వేడుకలు, తెలంగాణ డీప్‌టెక్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. 2034-35 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను అభివృద్ధి చేయడమే లక్ష్యమని వెల్లడించారు.
పరిశ్రమలకు హైదరాబాద్ బలమైన కేంద్రం
ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐఐటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థలు హైదరాబాద్‌కు ప్రధాన బలమని భట్టి పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, భారత్ ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పాలసీ వంటి కార్యక్రమాలు పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతమిస్తాయని చెప్పారు. సాఫ్ట్‌వేర్, ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, ఇంజినీరింగ్ రంగాల్లో హైదరాబాద్‌కు ఉన్న సామర్థ్యాన్ని డీప్‌టెక్ ఆవిష్కరణలకు ఉపయోగించుకోవాలని సూచించారు. స్టార్టప్‌లకు ఎదురయ్యే పెట్టుబడులు, పరీక్షా కేంద్రాలు, తొలి వినియోగదారుల సమస్యలను ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి పరిష్కరించాలని కోరారు. ఉమ్మడి పరీక్షా కేంద్రాలు, ధ్రువీకరణ మార్గదర్శకాలు, ప్రయోగాత్మక కొనుగోళ్ల ద్వారా కొత్త ఆవిష్కరణలను విజయవంతమైన ఉత్పత్తులుగా మార్చవచ్చన్నారు.
రైతులు, ప్రజలకు సాంకేతిక ప్రయోజనాలు
విద్యుత్ నిల్వ వ్యవస్థలు, పునరుత్పాదక ఇంధనం, వైద్య నిర్ధారణ పరికరాలు, వ్యవసాయ సాంకేతికతలో డీప్‌టెక్‌కు అపార అవకాశాలున్నాయని ఉప ముఖ్యమంత్రి వివరించారు. విద్యుత్ డిమాండ్‌ను ముందుగానే అంచనా వేసే పరిజ్ఞానం, సౌర విద్యుత్‌ను నిల్వ చేసుకునే విధానాలు అభివృద్ధి చేయాలని సూచించారు. రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించి దిగుబడులు పెంచే పరిష్కారాలు, వ్యాధులను ముందుగానే గుర్తించే వైద్య పరికరాలు అందుబాటులోకి రావాలన్నారు. ఆవిష్కరణలు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండాలని, యువతకు ఉపాధి కల్పించే నైపుణ్య శిక్షణకు పరిశ్రమలు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పరిశోధనలు, పెట్టుబడులను ప్రోత్సహిస్తామని తెలిపారు. 1927లో ఏర్పడిన ఫిక్కీ శతాబ్ది సందర్భంగా సంస్థ సేవలను ప్రశంసిస్తూ, డీప్‌టెక్ సవాళ్ల పరిష్కారంలో మరింత చొరవ చూపాలని కోరారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు.
#TelanganaDeepTech #DeepTechHub #BhattiVikramarka #SridharBabu #TelanganaEconomy #FICCI #DeepTechSummit #HyderabadStartups #Innovation #BharatFutureCity #TelanganaGlobalSummit #TechInnovation











