25 కిలోల బస్తాపై 26 కిలోల ముద్ర!
తూకంలో తేడాలు.. ధరల్లో బాదుడు!
మరోవైపు పీడీఎస్ రైస్ పక్కదారి.
25 కిలోల బస్తా.. 26 కిలోల లెక్క! ఇదేం బియ్యం వ్యాపారమో.. ఇదేం మాయాజాలమో! బస్తాలో బియ్యం 25 కిలోలే.. ముద్ర మాత్రం 26 కిలోలు! అంటే బియ్యం పెరగకపోయినా లెక్కల్లో మాత్రం కిలో పెరిగిందన్నమాట! తూకంలో తేడాలు, ధరల్లో బాదుడు.. మరోవైపు పేదల రేషన్ బియ్యానికీ పక్కదారి! హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధికారుల తనిఖీలతో బియ్యం వ్యాపారుల అక్రమాల డొంక కదిలింది. అధిక ధరల వసూళ్లు, నకిలీ లేబుళ్లు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. బస్తాలో బియ్యం ఎంత? బిల్లులో లెక్క ఎంత? అన్న చందంగా సాగుతున్న ఈ దందాపై అధికారులు కొరడా ఝళిపించారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొన్ని దుకాణాల్లో 25 కిలోల బియ్యం ఉన్న బస్తాలపై 26 కిలోలుగా ముద్రలు వేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తయారీదారులు ప్రకటించిన ధరలపై అదనపు స్టిక్కర్లు అంటించి ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు తేల్చారు. తూకం యంత్రాలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం కూడా బయటపడింది. కొనుగోలుదారుడికి తెలియకుండానే తూకం, ధర రెండింటిలోనూ మోసం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
రేషన్ బియ్యం పక్కదారి.. కేసులు
లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు!
పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం, నిల్వ చేయడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. ట్రేడ్, జీఎస్టీ, కార్మిక శాఖ, ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతులు లేకుండానే కొందరు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమాలకు సంబంధించిన ఆధారాలను ఫొటోలు, వీడియోల రూపంలో నమోదు చేశారు. సరూర్నగర్, జీడిమెట్ల, ఆల్వాల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందడంతో కేసులపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.
రూ.66 నుంచి రూ.79 వరకు ధరలు!
మరోవైపు హైదరాబాద్, మేడ్చల్ పట్టణ ప్రాంతాల్లో మూడు రకాల సన్నబియ్యానికి ప్రభుత్వం గరిష్ఠ చిల్లర ధరలు నిర్ణయించింది. అక్టోబర్ 31న ప్రకటించిన ఉత్తర్వుల ప్రకారం బీపీటీ/కేఎన్ఎం రకం కిలో రూ.66, ఆర్ఎన్ఆర్/తెలంగాణ సోనా రూ.74, హెచ్ఎంటీ/జేఎస్ఆర్ రకం రూ.79గా ఖరారు చేసింది. ఈ ధరలకు మించి విక్రయిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవైపు బస్తాపై కిలో అదనపు ముద్ర.. మరోవైపు ధరల్లో అదనపు వసూళ్లు.. ఇలాంటి మాయాజాలానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా అధికారులు నిఘా పెంచుతున్నారు. వ్యాపారులు నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.
#HyderabadRiceRaids #RiceWeightFraud #RiceOverpricing #Rangareddy #LegalMetrology #EnforcementTaskForce #PDSRice #RationRice #RiceTraders #TelanganaNews #CivilSupplies #RicePrices











