కంచె గచ్చిబౌలి, మియాపూర్ వరకు విజయాలు.
న్యాయపోరాటంలో ప్రభుత్వానికి ఊరట: పొంగులేటి.
ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో ఆక్రమణలను అడ్డుకోవడంతో పాటు, ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. గతంలో అధికారుల మధ్య సమన్వయం, పర్యవేక్షణ లోపాలతో విలువైన భూములపై వివాదాలు కొనసాగాయని పేర్కొన్నారు. ఇప్పుడు పాత రెవెన్యూ రికార్డులు, ఆధారాలను పరిశీలిస్తూ ప్రభుత్వ హక్కులను నిలబెట్టేందుకు రెవెన్యూ, న్యాయశాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. సుప్రీంకోర్టులో కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం, తాజాగా మియాపూర్ భూముల వివాదంలోనూ విజయం సాధించడం ఈ కృషికి నిదర్శనమని అన్నారు.
ప్రజల ఆస్తులే.. భవిష్యత్ తరాల సంపద
రెండు దశాబ్దాలుగా వివాదాల్లో ఉన్న విలువైన భూములను న్యాయపోరాటంతో తిరిగి ప్రభుత్వ హక్కుల్లోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రెవెన్యూ అధికారులు, న్యాయ నిపుణులు, ప్రభుత్వ న్యాయవాదులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ భూములు ఏ ఒక్క వ్యక్తికో, సంస్థకో చెందినవి కావని, అవి రాష్ట్ర ప్రజలందరి ఉమ్మడి ఆస్తి అని స్పష్టం చేశారు. వాటిని కాపాడటం ప్రస్తుత తరంతో పాటు భవిష్యత్ తరాల ప్రయోజనాలకు అవసరమన్నారు. ఆక్రమణలకు పాల్పడినా, అక్రమంగా హక్కులు పొందేందుకు ప్రయత్నించినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. భూముల పరిరక్షణకు క్షేత్రస్థాయిలో చర్యలతో పాటు న్యాయస్థానాల్లోనూ పోరాటం కొనసాగిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు.
#PonguletiSrinivasaReddy #TelanganaGovernment #KanchaGachibowli #MiyapurLands #GovernmentLands #LandEncroachment #TelanganaRevenueDepartment #RevanthReddy #SupremeCourt #LandDisputes #TelanganaNews











