Home National_news ‘బాప్‌’ వ్యాఖ్యతో దుమారం తెరపైకి పాత మళ్లీ వివాదం!

‘బాప్‌’ వ్యాఖ్యతో దుమారం తెరపైకి పాత మళ్లీ వివాదం!

.
మల్లికార్జున ఖర్గే దుర్యోధనుడు.
బీజేపీ ఘాటు వ్యాఖ్యలు .

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన తాజా వ్యాఖ్య దేశ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపింది. ఆదివారం పాట్నాలో జరిగిన కార్యక్రమంలో సభలోని ఓ వ్యక్తి మోదీ అధికారం నుంచి వెళ్లరనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించగా, ఖర్గే “మోదీ కా బాప్‌ భీ జాయేగా” అంటూ బదులిచ్చారు. ఆ వ్యక్తిని సభ నుంచి బయటకు పంపిన తర్వాత, తాను పూర్తి వాక్యం చెప్పలేదని, ప్రజా తిరుగుబాటు జరిగితేనే మోదీ వెళ్లిపోతారని అన్నానని వివరణ ఇచ్చాడు. ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఓ బీజేపీ నేత ఖర్గేను మహాభారతంలోని దుర్యోధనుడితో పోల్చారు. ప్రధానిపై ఖర్గే చేసిన వ్యాఖ్యల చుట్టూ వివాదం కొత్తదేమీ కాదు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి మాటల యుద్ధాలు జరిగాయి.

‘ఉగ్రవాది’ వ్యాఖ్యతో గతంలో దుమారం

ఆరు నెలల క్రితం తమిళనాడు ఎన్నికల ప్రచారంలో మోదీని ఉగ్రవాదిగా అభివర్ణించినట్లు ఆరోపణలు రావడంతో ఖర్గేపై బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే తాను ప్రధానిని ఉగ్రవాది అనలేదని, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల ద్వారా జరుగుతున్న ‘పన్నుల ఉగ్రవాదం’ గురించి మాట్లాడానని ఖర్గే వివరణ ఇచ్చారు. 2024లో కర్ణాటకలోనూ బీజేపీని ఉగ్రవాదులతో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ నేతలు మూకదాడులకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది తీవ్రంగా స్పందించారు.

విషసర్పం వ్యాఖ్యతో మరోసారి విమర్శలు

2026 ఏప్రిల్‌లో అసోం ఎన్నికల సభలో ఖర్గే ఆర్ఎస్ఎస్‌, బీజేపీలను విషసర్పాలతో పోల్చారు. దీనిపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. 2023 కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ మోదీని విషసర్పంతో పోల్చిన ఖర్గే, ఆ తర్వాత విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు మోదీ వ్యక్తిగతంగా ఉద్దేశించినవి కావని స్పష్టం చేశారు. తమ పోరాటం ప్రధానితో వ్యక్తిగతంగా కాదని చెప్పారు.

రావణుడితో పోలిక.. పాత సవాలు

2022లో అహ్మదాబాద్‌లో మోదీ ముఖం ఎన్నిసార్లు చూడాలంటూ, ఆయనకు రావణుడిలా వంద తలలు ఉన్నాయా అని ఖర్గే ప్రశ్నించారు. ఇది గుజరాత్‌ ప్రజలను అవమానించడమేనని మోదీ విమర్శించారు. 2019లో కాంగ్రెస్‌కు 40 లోక్‌సభ స్థానాలు కూడా రావంటూ మోదీ చేసిన వ్యాఖ్యకు స్పందిస్తూ, అంతకంటే ఎక్కువ స్థానాలు వస్తే ఢిల్లీలోని విజయ్‌ చౌక్‌లో ఉరేసుకుంటారా అని ఖర్గే సవాల్‌ చేశారు. ఎన్నికల వేళ పరస్పర విమర్శలు తీవ్రంగా ఉన్నా, కొన్ని సందర్భాల్లో మోదీ, ఖర్గే సామాజిక కార్యక్రమాల్లో సరదాగా మాట్లాడుకున్న సందర్భాలూ ఉన్నాయి. వీరి మధ్య రాజకీయ పోరు వ్యక్తిగత వ్యాఖ్యల స్థాయికి చేరడం మాత్రం తరచూ చర్చనీయాంశమవుతోంది.

 

#MallikarjunKharge #NarendraModi #ModiRemark #KhargeControversy #BJP #Congress #Duryodhana #PatnaPolitics #PoliticalWarOfWords #IndianPolitics #PoliticalControversy #BJPvsCongress