Home Telangana జర్నలిస్టుల ఇళ్ల కలకు భరోసా!

జర్నలిస్టుల ఇళ్ల కలకు భరోసా!

రెండు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు .
న్యాయ చిక్కులు లేని స్థలాల పంపిణీ.
సమాచార మంత్రి పొంగులేటి వెల్లడి .

తెలంగాణలో ఇళ్ల స్థలాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల కలను సాకారం చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. చట్టపరమైన చిక్కులు లేని విధంగా, కుటుంబాలతో గౌరవంగా నివసించేందుకు అనువైన ప్రాంతాల్లో స్థలాలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని తెలిపారు. జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో భరోసా ఇచ్చారు.

సుప్రీంకోర్టు కేసుతో నిలిచిన ప్రక్రియ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లో జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీకి భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని మంత్రి గుర్తుచేశారు. అయితే, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో స్థలాల పంపిణీ ప్రక్రియ సుదీర్ఘకాలం నిలిచిపోయిందన్నారు. 2022లో న్యాయపరమైన అడ్డంకులు తొలగినప్పటికీ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఈ అంశంపై చొరవ తీసుకుంది. 2024 సెప్టెంబర్‌ 8న రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో హౌసింగ్‌ సొసైటీకి భూమిని అప్పగించినట్లు తెలిపారు. అనంతరం సుప్రీంకోర్టు తుది ఉత్తర్వుల నేపథ్యంలో మరోసారి న్యాయపరమైన సమస్యలు తలెత్తడంతో శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి, సహచర మంత్రులతో పలుమార్లు చర్చించినట్లు వెల్లడించారు.

చట్టబద్ధంగా స్థలాలు.. సంక్షేమానికి ప్రాధాన్యం

గతంలో ఎదురైన న్యాయపరమైన సమస్యలు మళ్లీ తలెత్తకుండా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నామని పొంగులేటి తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే గతంలో చొరవ తీసుకుందని, మరోసారి తమ ప్రభుత్వ హయాంలోనే వారి సొంతింటి కలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషించే జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. వారి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంతోపాటు గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన, చట్టపరమైన అడ్డంకులు లేని శాశ్వత పరిష్కారంతో జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి భరోసా ఇచ్చారు.

#TelanganaJournalists #JournalistsHousingPlots #PonguletiSrinivasaReddy #RevanthReddy #JournalistWelfare #TelanganaGovernment #HousingSociety #HousingPlots #SupremeCourtCase #TelanganaNews #JournalistsWelfare