కడప జిల్లా | వేంపల్లి: నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అంబేద్కర్ సాక్షిగా సవాల్ విసురుతున్నాం.. అభ్యర్థులను నామినేషన్ కేంద్రానికి అనుమతించి ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవండి! అంటూ వైసీపీ వేంపల్లి మాజీ జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి అధికార పక్షానికి సవాల్ విసిరారు. వేంపల్లిలో ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా పోలీసులు తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వేంపల్లిలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ రాజకీయ వివాదానికి దారితీసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 18 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు బయలుదేరగా, ఎంపీడీవో కార్యాలయానికి సుమారు అర్ధ కిలోమీటరు ముందే బిరాలమిట్ట కాలేజీ రోడ్డు వద్ద పోలీసులు ముళ్లకంచెలు ఏర్పాటు చేసి అడ్డుకున్నారని మాజీ జెడ్పీటీసీ మాచి రెడ్డి రవికుమార్ రెడ్డి ఆరోపించారు.

నామినేషన్ కేంద్రానికి పంపించాలని రోడ్డుపై బైఠాయించిన నేతలు
పులివెందుల రోడ్డులోని తాత్కాలిక వైసీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన వైసీపీ నాయకులు, అభ్యర్థులను పోలీసులు నిలువరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు పోలీసు భద్రత కల్పించి నామినేషన్లు దాఖలు చేయించేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు వేంపల్లి సీఐ నర్సింహులును కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి భద్రత కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని సీఐ తెలిపినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, ఆర్డీవో చిన్నయ్య ఘటనాస్థలికి చేరుకుని ఎన్నికల నిబంధనలు పాటించాలని వైసీపీ నాయకులకు సూచించారు. అయితే, అభ్యర్థులను నామినేషన్ కేంద్రానికి అనుమతించాలని కోరుతూ వైసీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. అక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించడంతో నాయకులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

“మాతో నామినేషన్లు వేయించి.. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవండి!”
ఈ ఘటనపై వేంపల్లి అడ్డరోడ్డు వద్ద మాట్లాడిన మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి అధికార పక్షానికి సవాల్ విసిరారు. “మీకు ధైర్యం ఉంటే మా అభ్యర్థులతో నామినేషన్లు వేయించండి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి మాపై గెలవండి. మీరు గెలవండి.. ప్రజల మన్ననలు పొందండి. అంబేద్కర్ సాక్షిగా సవాల్ విసురుతున్నాం.. మా అభ్యర్థులను నామినేషన్లు వేయనిచ్చి, ప్రజాస్వామ్య పద్ధతిలో మాపై విజయం సాధించండి” అని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని, ఆ తర్వాత కొన్ని నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, మరికొన్ని ఉపసంహరణకు వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. కానీ, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న పరిస్థితి గతంలో లేదని అన్నారు. దీనికి సంబంధించిన వివరాలు జిల్లా పరిషత్ రికార్డుల్లో పరిశీలించవచ్చని తెలిపారు. వేంపల్లిలోని 18 ఎంపీటీసీ స్థానాల్లో తమ పార్టీ కేవలం మూడు స్థానాల్లో గెలిచినా, రాజకీయ సన్యాసం చేసి భవిష్యత్తులో తమ పార్టీ తరఫున సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోమని చెప్పారు.

“రెండున్నరేళ్లుగా రోడ్డు పూర్తి చేయలేకపోయారు”
స్థానిక అభివృద్ధి అంశాన్ని ప్రస్తావిస్తూ రవికుమార్ రెడ్డి అధికార పక్షంపై విమర్శలు చేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మంజూరైన రహదారి పనులను రెండున్నర సంవత్సరాలుగా పూర్తి చేయలేకపోతున్నారని ఆరోపించారు. “మా ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆరు నెలల్లోనే రోడ్డు పనులు పూర్తి చేసి, వీధి దీపాలు ఏర్పాటు చేసి, వేంపల్లిని సుందరమైన పంచాయతీగా తీర్చిదిద్దేవాళ్లం” అని ఆయన వ్యాఖ్యానించారు.
సాయంత్రం వరకు వైసీపీ నుంచి నామినేషన్ దాఖలు కాలేదని సమాచారం
ఈ పరిణామాల నేపథ్యంలో సాయంత్రం వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని సమాచారం . నామినేషన్ల ప్రక్రియలో తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకున్నారని వైసీపీ నాయకులు ఆరోపించగా, ఎన్నికల నిబంధనల అమలుపై చర్చ మొదలైంది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేంపల్లిలో నామినేషన్ల ప్రక్రియపై నెలకొన్న ఈ వివాదం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి సంబంధిత అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.











