విజయవాడ మేయర్ పోరు.. రాజకీయాల్లో కొత్త మలుపు! ఏబీవీ ఎంట్రీతో మారనున్న సమీకరణాలు

ABV’s Mayoral Entry Reshapes Vijayawada Political Battle

నాలుగు కీలక శక్తులు.. విజయవాడలో మేయర్ పోరు

ఏబీవీ ఎంట్రీతో రాజకీయ వేడి

అమరావతి, అక్టోబర్ 20: రాజకీయ రాజధాని విజయవాడలో మేయర్ పీఠం చుట్టూ కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఆయనకు మద్దతు ప్రకటించాయి. మరోవైపు వంగవీటి రాధా జనసేన తరఫున పోటీకి దిగడం, వైఎస్సార్‌సీపీ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని మళ్లీ రంగంలోకి దింపడం రాజకీయ వేడిని పెంచాయి.

కూటమిలో సీట్ల పంచాయతీ

టీడీపీలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించగా, మరో ఎనిమిది మంది నేతలు మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. టీడీపీ కార్యకర్తలు జనసేన అభ్యర్థికి, జనసేన కార్యకర్తలు టీడీపీ అభ్యర్థికి ఎంతవరకు సహకరిస్తారన్నది కీలక ప్రశ్నగా మారింది. రాధా పార్టీ మార్పు వ్యక్తిగత మద్దతును పెంచుతుందా, జనసేన సంస్థాగత బలం ఎంతవరకు ఉపయోగపడుతుందా అన్నది తేలాల్సి ఉంది.

ఏబీవీకి అనుభవం.. భాగ్యలక్ష్మికి పాలన

విజయవాడ పోలీస్ కమిషనర్‌గా రెండుసార్లు పనిచేసిన ఏబీవీకి నగరంలోని వివిధ వర్గాలతో పరిచయాలు ఉన్నాయని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. రైతుల సమస్యలపై పోరాటం చేసిన నేపథ్యం కూడా ఆయనకు మద్దతు సమీకరించడంలో ఉపయోగపడవచ్చు. అయితే కాంగ్రెస్, వామపక్షాల మద్దతు వెనుక రాజకీయ వ్యూహం ఏమిటన్నది చర్చనీయాంశంగా ఉంది. మరోవైపు భాగ్యలక్ష్మి తన గత పాలనలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారులు, ప్రజారోగ్యంపై చేసిన పనులను ప్రజలకు వివరించాల్సి ఉంది.


1995 చరిత్ర.. నేటి ఎన్నికల పాఠం

1995లో సీపీఐ నేత టీ. వెంకటేశ్వరరావు మేయర్‌గా ఎన్నికయ్యారు. అప్పట్లో వార్డుల్లో టీడీపీకి బలం ఉన్నప్పటికీ మేయర్ ఎన్నికలో ఆయన విజయం సాధించడం ప్రత్యేకంగా నిలిచింది. 1981లోనూ విజయవాడ తొలి మేయర్‌గా ఆయన పనిచేశారు. తరువాత 2000లో పంచుమర్తి అనురాధ, 2014లో కోనేరు శ్రీధర్ టీడీపీ తరఫున మేయర్లుగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన రాయన భాగ్యలక్ష్మి మేయర్‌గా పనిచేశారు. ఇప్పుడు వార్డు సభ్యుడికి ఒక బ్యాలెట్, మేయర్ అభ్యర్థికి మరో బ్యాలెట్ ద్వారా ఓటు వేయనున్న నేపథ్యంలో వార్డు అభ్యర్థికి వేసే ఓటు, మేయర్ అభ్యర్థికి వేసే ఓటు ఒకే పార్టీకి పడతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు.. ఎంపీ కౌంటర్

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, వంగవీటి రాధాను జనసేనలోకి పంపించి, ఏబీవీని స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టడం చంద్రబాబు రాజకీయ వ్యూహమంటూ విమర్శించారు. ఏబీవీకి కాంగ్రెస్, వామపక్షాలు మద్దతివ్వడంపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యాఖ్యలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఖండించారు. ఏబీవీ షిరిడిసాయి, మేఘ సంస్థలపై న్యాయపోరాటం చేస్తుంటే విజయసాయిరెడ్డికి ఎందుకు కోపమంటూ స్పందించారు.

86 డివిజన్లు.. ఓటరుకు అసలు పరీక్ష

పునర్విభజనతో విజయవాడ కార్పొరేషన్ డివిజన్ల సంఖ్య 64 నుంచి 86కి పెరిగింది. తక్కువ సమయంలో విస్తృత ప్రచారం నిర్వహించడం అభ్యర్థులకు సవాలుగా మారింది. వర్షాకాలంలో వరదలు, వేసవిలో నీడలేమి, వీఐపీల పర్యటనల సమయంలో ట్రాఫిక్ సమస్యలు నగరానికి ప్రధాన సవాళ్లు. ఈ పరిస్థితుల్లో పార్టీ బలం, కుల సమీకరణాలు, వ్యక్తిగత ఆదరణలో ఏది పైచేయి సాధిస్తుందన్నది స్పష్టంగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. అభ్యర్థులే కాదు, ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ఓటర్లు కూడా సందిగ్ధంలో పడే పరిస్థితి కనిపిస్తోంది.

రచన: శ్రీనివాసరావు తాతినేని