Home Telangana పార్టీలు కాదు.. పేదరికమే ప్రామాణికత

పార్టీలు కాదు.. పేదరికమే ప్రామాణికత

ఇందిరమ్మ ఇళ్లలో రాజకీయ వివక్షకు చెక్‌!
అర్హులకే ఇళ్లు కేటాయింపు: పొంగులేటి .

అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి వివక్ష చూపబోమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని నియోజకవర్గాలకే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు పరిమితమయ్యాయని విమర్శించిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమానంగా చూస్తోందని తెలిపారు. బుధవారం మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా పోచారంలో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లో భూముల ధరలు ఎకరాకు వందల కోట్ల రూపాయలు పలుకుతున్నా, పేదలు నివసించే ప్రాంతాల్లోనే వారికి గౌరవప్రదమైన నివాసాలు కల్పించడమే ఇందిరమ్మ టవర్స్‌ లక్ష్యమని పేర్కొన్నారు. నగరంలో ఉపాధి పొందుతున్న పేదలను దూర ప్రాంతాలకు తరలించకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

తొలి విడతలో లక్ష ఇళ్లు.. 480 మందికి కేటాయింపు

క్యూర్‌ పరిధిలో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, 23 నియోజకవర్గాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఆరు ప్రాంతాల్లో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో తొలి విడతగా 480 మంది లబ్ధిదారులను పారదర్శకమైన బహిరంగ డ్రా ద్వారా ఎంపిక చేసినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను పరిశీలించి, సొంత ఇళ్లు ఉన్నవారిని గుర్తించి, అర్హతలను నిర్ధారించిన తర్వాతే కేటాయింపులు చేపట్టామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 2.20 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని పేర్కొన్నారు. ఇందిరమ్మ టవర్స్‌లో ఎంపికైన వారికి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు లేకుండా పూర్తి హక్కులతో ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. అపార్ట్‌మెంట్‌ భూమిలో వాటాను కూడా రిజిస్ట్రేషన్‌లో పొందుపరుస్తామని తెలిపారు. వచ్చే బతుకమ్మ పండుగ నాటికి తొలి విడత ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందించడమే లక్ష్యమన్నారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు మహర్దశ
తొలి విడతలో అవకాశం దక్కని అర్హులు నిరాశ చెందవద్దని, తదుపరి విడతల్లో కొత్త దరఖాస్తులను కూడా పరిశీలిస్తామని పొంగులేటి భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించారు. ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించి, సమీప ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు నిబంధనల ప్రకారం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు రూ.440 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేకుండా అర్హత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, హౌసింగ్‌ శాఖ ఎండీ వి.పి. గౌతమ్‌, కలెక్టర్‌ మనుచౌదరి తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులు స్నేహ, శివకుమారి, రెహ్మతి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రశంసించారు. అనంతరం ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపు కార్యక్రమం నిర్వహించారు.

 

#IndirammaHousingScheme #PonguletiSrinivasaReddy #RevanthReddy #IndirammaTowers #TelanganaHousing #HousingForPoor #DoubleBedroomHouses #Medchal #TelanganaGovernment #AffordableHousing #HousingBeneficiaries #TelanganaNews