269 ఏళ్ల విశ్వాసానికి నీరాజనం.
వాన గాలుల మధ్య భక్తి వెల్లువ.
✍️ ఎలిశెట్టి సురేష్ కుమార్
269 ఏళ్ల చరిత్ర కలిగిన విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఈ ఏడాది ప్రతికూల వాతావరణాన్ని అధిగమించి అద్భుతంగా ముగిసింది. భారీ వర్షాలు, బలమైన గాలుల హెచ్చరికలు భక్తుల ఉత్సాహాన్ని తగ్గించలేకపోయాయి. సోమవారం తొలేళ్ల ఉత్సవం ఆనందోత్సాహాల మధ్య జరగగా, మరుసటి రోజు అర్ధరాత్రి నుంచే గాలులు, తెల్లవారుజాము నుంచి వర్షం మొదలయ్యాయి. సిరిమాను తిరిగే సమయానికి వాన కొంత తగ్గినా గాలులు కొనసాగాయి. అయినప్పటికీ భక్తుల రాక తగ్గలేదు.. ఉత్సవ ఏర్పాట్లు నిలిచిపోలేదు. అమ్మవారి ఉత్సవం సజావుగా సాగుతుందా అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ వేడుక ఘనంగా జరిగింది.
సంప్రదాయ వైభవంతో మూడు పర్యాయాలు
నిర్ణీత సమయం మధ్యాహ్నం మూడు గంటలకు పైడితల్లి ఆలయం నుంచి సిరిమాను ఊరేగింపు ప్రారంభమైంది. తెల్ల ఏనుగు, బెస్తల వల, చెలికత్తెలు, సోదరుడు పోతురాజు ముందుండగా ఉత్సవం సాగింది. ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానుపై అధిరోహించి అక్షతలు చల్లుతూ భక్తులకు ఆశీస్సులు అందించారు. సిరిమాను కోట వరకు మూడు పర్యాయాలు తిరిగి సంప్రదాయాన్ని కొనసాగించింది. కోట బురుజుపై అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా పైడిమాంబకు నమస్కరించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఉత్సవ నిర్వహణలో ముందుండి కీలక బాధ్యతలు చేపట్టారు. వర్షం మధ్యనూ భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
సమన్వయంతో విజయవంతమైన నిర్వహణ
ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉత్సవాన్ని విజయవంతం చేయడంలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, మున్సిపల్ సిబ్బంది, ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేశాయి. కలెక్టర్ రామసుందరరెడ్డి, ఎస్పీ దామోదర్, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి నేతృత్వంలో అధికారులు, సిబ్బంది తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. వాతావరణ ప్రతికూలతలను లెక్కచేయకుండా సహకరించిన ప్రజలు ప్రత్యేక అభినందనలకు అర్హులు. తరాలు మారినా చెక్కుచెదరని విశ్వాసం, ఏటేటా పెరుగుతున్న భక్తి ఉత్సాహం పైడితల్లి జాతర ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పాయి. వాన గాలుల మధ్యన సాగిన ఈ సిరిమానోత్సవం విజయనగరం ప్రజల ఆధ్యాత్మిక నిబద్ధతకు, సంప్రదాయ పరిరక్షణకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
#PydithalliSirimanuUtsavam #PydithalliAmmavaru #Vizianagaram #SirimanuUtsavam #269YearsOfTradition #AndhraPradesh #TempleFestival #PydithalliJatara #AshokGajapathiRaju #AditiGajapathiRaju #NorthAndhra #CulturalHeritage











