విజయసాయిరెడ్డి ఆరోపణలు.
వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలపై సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి తనపై తప్పుడు ప్రచారం చేయించారని, దాని వల్లే మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి తనకు మధ్య దూరం పెరిగిందని ఆయన ఆరోపించారు. విశాఖలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన విజయసాయి.. తాను ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న సమయంలో భూకబ్జాలు, బెదిరింపుల ఆరోపణలు తనపై వచ్చాయని గుర్తుచేశారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. విశాఖలో తనకు ఉన్నది ఒక్క ఫ్లాట్ మాత్రమేనని, ఒక్క సెంటు భూమి కూడా తన పేరుపై లేదని చెప్పారు. పార్టీ అధికారంలోకి రావడానికి ముందు తన సేవలను ఉపయోగించుకున్న నాయకత్వం.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనను పక్కన పెట్టిందని ఆయన పేర్కొన్నారు.
పార్టీ పతనానికి అదే కారణం
వైఎస్సార్సీపీ ప్రస్తుత రాజకీయ పరిస్థితికి సజ్జల వ్యవహార శైలే ప్రధాన కారణమని విజయసాయి ఆరోపించారు. 2019–24 మధ్య ప్రభుత్వ నిర్ణయాల్లో తనకు ఎలాంటి కీలక పాత్ర లేదని, తన బాధ్యతలు ప్రధానంగా ఢిల్లీ రాజకీయ వ్యవహారాలకే పరిమితమయ్యాయని చెప్పారు. 2021 జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ కోసం వ్యక్తిగతంగా ఖర్చు చేసి పనిచేశానని గుర్తుచేశారు. తనపై ఆరోపణలు చేసిన స్థానిక నాయకులు ఇప్పుడు పార్టీ కోసం ఎంత పనిచేస్తారో రాబోయే స్థానిక ఎన్నికల్లో నిరూపించుకోవాలని సవాల్ చేశారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టేలా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఉత్తరాంధ్రే కేంద్రంగా కొత్త అడుగు
కొత్త రాజకీయ వేదిక ద్వారా ఉత్తరాంధ్ర సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తామని విజయసాయి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయడం, వలసలు, నీటి కొరత, ఉద్దానం సమస్యలకు పరిష్కారాలు చూపడం తమ ప్రతిపాదనల్లో ఉన్నాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని సమస్యలు, మత మార్పిడుల అంశాలను కూడా ప్రస్తావించారు. త్వరలో కొత్త పార్టీ పేరు ప్రకటించి, ఆ తర్వాత ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే విజయవాడ, అనంతపురం వేదికగా పలు ప్రతిపాదనలు వెల్లడించిన విజయసాయి.. ఇప్పుడు ఉత్తరాంధ్ర కేంద్రంగా కొత్త రాజకీయ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
#VijaysaiReddy #SajjalaRamakrishnaReddy #YSRCP #YSJagan #AndhraPradeshPolitics #NorthAndhra #VijaysaiReddyNewParty #YSRCPInternalPolitics #Sajjala #NorthAndhraDevelopment #Uddanam #PoliticalParty #APPolitics #Visakhapatnam #AndhraPradeshNews











