రాచమల్లు నోరు అదుపులో పెట్టుకోవాలి.. నంద్యాల కొండారెడ్డి ఘాటు వ్యాఖ్యలు!

Nandyala Kondareddy Warns Former MLA Rachamallu Over Remarks

రాచమల్లు నోరు అదుపులో పెట్టుకోవాలి.. నంద్యాల కొండారెడ్డి ఘాటు వ్యాఖ్యలు!

‘నువ్వు నోటికి పని చెబితే.. మేము చేతికి పని చెబుతాం’ అంటూ హెచ్చరిక

ప్రొద్దుటూరు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నాయకుడు నంద్యాల కొండారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా రాచమల్లు నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. నువ్వు నోటికి పని చెబితే.. మేము చేతికి పని చెబుతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రొద్దుటూరులో ప్రశాంత వాతావరణం కొనసాగాలని తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడే రాచమల్లు నామినేషన్ ప్రక్రియకు దూరంగా ఉన్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయని హేళన చేసిన రాచమల్లుకు, ప్రజలు 11 సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మద్దతు లభించడం లేదనే ఆక్రోశంతోనే అహంకారపూరిత భాషలో మాట్లాడుతున్నారని విమర్శించారు.

గత ఎన్నికల సమయంలో పోలీసులను అడ్డుపెట్టుకుని అభ్యర్థుల ఇళ్ల వద్దకు వెళ్లి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న విషయాన్ని రాచమల్లు మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేసి గెలవవచ్చని, ఎన్నికల ప్రక్రియను అవహేళన చేయడం సరికాదని హితవు పలికారు. రాచమల్లు తన సతీమణి రమాదేవితో నామినేషన్ ఎందుకు ఉపసంహరింపజేశారని కొండారెడ్డి ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల విషయంలో ఒక విధంగా, పార్టీ నాయకుల విషయంలో మరో విధంగా వ్యవహరిస్తున్నారా అని నిలదీశారు. అంతేకాకుండా..2029 లో వైసీపీ అధికారంలోకి వస్తే.. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఉన్న నంద్యాల రాఘవరెడ్డి ఇతర కౌన్సిల్ సభ్యులతో రాజీనామా చేయిస్తానని రాచమల్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వాళ్ళతో రాజీనామా ఎలా చేయిస్తారో అప్పుడు మేమూ చూస్తామంటూ రాచమల్లుకు సవాల్ విసిరారు.

రాచమల్లు మాట్లాడుతున్న మాటలపై కేసులు నమోదైతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే భాషను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తాము అధికార రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నాణ్యమైన విద్య, వైద్యం అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రొద్దుటూరులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని సూచించిన కొండారెడ్డి, రాచమల్లు తన మాటతీరును మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కడంతో ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.