40% వర్షపాతం లోటన్న మాజీ మంత్రి కాకాణి .
నెల్లూరు జిల్లాలో 40 శాతం వర్షపాతం లోటు కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక రూపొందించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. కరువు ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సూచనలు, అవసరమైన విత్తనాల పంపిణీ చేపట్టాలని కోరారు. వర్షాలు లేక పశువులకు మేత కొరత ఏర్పడి, కొన్ని ప్రాంతాల్లో రైతులు పశువులను విక్రయించే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వలు
సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో సాగునీటితో పాటు తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని కాకాణి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిని వినియోగించి ఈ రెండు జలాశయాలను నింపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి కొరతతో పంటలు సాగు చేయలేక రైతులు పెట్టుబడులు నష్టపోతున్నారని తెలిపారు. సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని కాకాణి కోరారు.











