Home AP కేంద్రం సాయం కావాలి!

కేంద్రం సాయం కావాలి!

తుపాన్లతో రూ.7 వేల కోట్లకు పైగా నష్టం.
తక్షణ ఆర్థిక సాయం అందించండి.
నిధుల విడుదలకు చంద్రబాబు విజ్ఞప్తి.

వరుస తుపాన్లతో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం తక్షణ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఢిల్లీలో మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన ఆయన రాష్ట్ర పరిస్థితులను వివరించారు. ఇటీవల వచ్చిన అర్నబ్‌, మురసు తుపాన్ల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని తెలిపారు. చేతికొచ్చే దశలో ఉన్న పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టిసీమ ద్వారా కొన్ని ప్రాంతాలకు నీరందించామని వివరించారు. తుపాన్ల కారణంగా తీర ప్రాంత మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా విద్యుత్‌ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించాయని, వాటి నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. నివేదిక వచ్చేలోగా తక్షణ సాయం అందిస్తే రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని విజ్ఞప్తి చేశారు.

రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌కు నిధులు

రాష్ట్రంలో ప్రాంతాల వారీగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళికలను కూడా చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌కు గతంలో నిర్మలా సీతారామన్‌ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ రహదారులు, సాగునీటి వసతులు, బిందు సేద్యం వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హార్టికల్చర్‌ హబ్‌ పనులకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

విశాఖ ఆర్థిక ప్రాంతానికి చేయూత

వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ ఆర్థిక ప్రాంతానికి అదనపు నిధులు కేటాయించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్రం మరింత సహకరిస్తే ఈ ప్రాంత అభివృద్ధి ఫలాలు ప్రజలకు విస్తృతంగా అందుతాయని వివరించారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు వివరాలను కూడా ప్రస్తావించారు. సదస్సులో కుదిరిన పెట్టుబడి ఒప్పందాలు, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన చర్చలను నిర్మలా సీతారామన్‌కు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, పలువురు ఎంపీలు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

#ChandrababuNaidu #AndhraPradesh #CycloneDamage #CentralAssistance #NirmalaSitharaman #ArnabCyclone #MurasuCyclone #Rayalaseema #HorticultureHub #Visakhapatnam #PayyavulaKeshav #APNews