Home AP ఫిర్యాదులపై నిర్లక్ష్యం సహించను!

ఫిర్యాదులపై నిర్లక్ష్యం సహించను!

పరిష్కారంలో జవాబుదారీతనం తప్పనిసరి.
ప్రజా సమస్యలపై అధికారులకు సీఎం డైరెక్షన్ .

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఇచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్‌ ద్వారా వివిధ శాఖల పనితీరును సమీక్షించిన ఆయన, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు. ప్రజల సమస్యలకు సకాలంలో పరిష్కారం చూపడం ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్‌) ద్వారా సమస్యలను వీలైనంత మేర పరిష్కరిస్తున్నామని అధికారులు వివరించారు. అయితే ఈ ప్రక్రియను మరింత వేగంగా, సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.

175 నియోజకవర్గాల్లో అధికారులపై పర్యవేక్షణ

ఫిర్యాదుల పరిష్కారంలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల నోడల్ అధికారులు ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించాలని సూచించారు. ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు ఉద్యోగులు, అధికారుల బాధ్యతలను స్పష్టంగా నిర్ధారించాలని చెప్పారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా సమస్యలను వేగంగా పరిష్కరించేలా వ్యవస్థను బలోపేతం చేయాలనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి బాధ్యులైన వారిపై జవాబుదారీతనం ఉండాలని సీఎం స్పష్టం చేశారు.

ప్రభుత్వ జీవోలపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి

వివిధ ప్రభుత్వ శాఖలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలను వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవోపై ఇలాంటి ప్రచారం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలపై అపోహలు వ్యాపించకుండా వాస్తవాలను ప్రజలకు ఎప్పటికప్పుడు స్పష్టంగా వివరించాలని అధికారులకు సూచించారు. తప్పుడు ప్రచారానికి సమర్థమైన సమాచారంతో సమాధానం ఇవ్వాలని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందించడం, ఫిర్యాదులను పరిష్కరించడం, ప్రభుత్వ నిర్ణయాలపై వాస్తవాలను తెలియజేయడం వంటి అంశాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎస్‌ సాయి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

#ChandrababuNaidu #AndhraPradesh #PublicGrievances #GrievanceRedressal #GovernmentAccountability #PGRS #RTGS #PublicServiceDelivery #SaiPrasad #DistrictCollectors #APGovernment #Governance #GovernmentOrders #APNews