హైదరాబాద్: గోల్కొండ సెకండ్ లాన్సర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నస్రీన్ సుల్తానాకు ఉర్దూ అకాడమీ జెద్దా–హైదరాబాద్ చాప్టర్ ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ హెడ్మాస్టర్ అవార్డు’ అందజేసింది. విద్యారంగంలో అత్యుత్తమ పనితీరు, పాఠశాల నిర్వహణలో చొరవ, విద్యార్థుల అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. హైదరాబాద్లో 11-10-2026న జరిగిన కార్యక్రమంలో చాప్టర్ చీఫ్ ప్యాట్రన్ షేక్ ఇబ్రహీం, అధ్యక్షుడు సలీమ్ అహ్మద్ ఫరూఖీ తదితరులు ఆమెను అభినందించారు. ఇదే సంస్థ నిర్వహించిన 2026 బంగారు పతకాలు, ప్రశంసాపత్రాల ప్రదానోత్సవంలో తెలంగాణలోని ఉర్దూ మాధ్యమ పాఠశాలలకు చెందిన 31 మంది ఎస్ఎస్సీ ప్రతిభావంతులను సత్కరించారు. ఖిల్వత్ దారుల్షిఫాలోని ఉర్దూ మస్కన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ రియాజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉన్నత లక్ష్యాల దిశగా ప్రోత్సహించడం, ఉర్దూ మాధ్యమ విద్యలో ప్రతిభను గుర్తించడం కార్యక్రమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.












