విద్యాశాఖకి నారా లోకేశ్ ఆదేశాలు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌ను నెల రోజుల్లో జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించిన ఆయన.. నోటిఫికేషన్ నుంచి ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చే వరకు ప్రతి దశలో పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. రాష్ట్ర నియామక విధానాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నాయని లోకేశ్ పేర్కొన్నారు.
పదో తరగతిపై ‘మిషన్ మార్చి’
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా చేపట్టిన ‘మిషన్ మార్చి’ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. డ్రాపౌట్ల సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పాఠశాల మానేసిన విద్యార్థులు మాదకద్రవ్యాల వినియోగం వంటి సామాజిక సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందన్న అంశాన్ని ప్రస్తావించారు. కమ్యూనిటీ నాయకులను భాగస్వామ్యం చేస్తూ ‘జీరో డ్రాపౌట్ మిషన్’ ప్రారంభించాలని చెప్పారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ‘డ్రగ్స్ వద్దు బ్రో’ వంటి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.
175 పాఠశాలలకు లీప్ హోదా
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పాఠశాలను ఎంపిక చేసి, వాటిని ‘లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ పాఠశాలలుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని లోకేశ్ ఆదేశించారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్–2025 అమలుపైనా సమీక్షించారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. రాత పరీక్షను డిసెంబరులో నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోందని అధికారులు తెలిపారు. పలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో క్యాంపస్‌ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో అనువైన భూములను గుర్తించాలని మంత్రి ఆదేశించారు.
ఆటిజం కేంద్రాలు, విద్యా ప్రాజెక్టులకు వేగం
రాష్ట్రవ్యాప్తంగా 125 ఆటిజం కేంద్రాల ఏర్పాటును వేగవంతం చేయాలని లోకేశ్ ఆదేశించారు. తొలి దశలో 21 కేంద్రాలకు కౌన్సిలర్లను గుర్తించగా, 14 కేంద్రాల్లో భవన నిర్మాణ పనులు అక్టోబర్ చివరికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు. డిసెంబరులో తొలి దశ ముగియనున్న నేపథ్యంలో ఎస్ఏఎల్‌టీ కార్యక్రమం రెండో దశకు చర్యలు ప్రారంభించాలని మంత్రి సూచించారు. విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పబ్లిక్ లైబ్రరీస్ శాఖ సహకారంతో నిర్మించనున్న ఆధునిక గ్రంథాలయ నమూనాలను కూడా ఆయన పరిశీలించారు.
#APDSC #DSC2026 #DSC20 #NaraLokesh #TeacherRecruitment #TeacherJobs #AndhraPradesh #EducationDepartment #MissionMarch #ZeroDropoutMission #LEAPSchools #APPSC











