Home National_news లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారు

లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారు

సీఈసీ తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యం .
సర్ నిర్ణయంపై మాజీ సీఈసీ హాట్ కామెంట్స్ .

స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి ఇంత పెద్ద సంఖ్యలో అర్హులైన ఓటర్లు ఓటు హక్కును కోల్పోయారని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అమలు తీరుపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి పలు అంశాలపై 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. కేవలం డిసెంట్‌ నోట్లకే పరిమితం కాకుండా తదుపరి సమావేశంలోనే నిర్ణయాలను ఓటింగ్‌కు పెట్టాల్సిందని రావత్‌ అన్నారు. ఇద్దరు కమిషనర్లకు మెజారిటీ ఉన్నందున వారి అభిప్రాయం అమలయ్యేదని పేర్కొన్నారు.

సీఈసీకి వీటో అధికారం లేదు

ఎన్నికల కమిషన్‌ పనితీరును వివరిస్తూ రావత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు కమిషనర్లు ఏకాభిప్రాయానికి రాకపోతే ఓటింగ్‌ ద్వారా మెజారిటీ నిర్ణయమే అమలవుతుందని చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ప్రత్యేక వీటో అధికారం లేదని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో సర్ సందర్భంగా తొలగించిన ఓటర్లలో అప్పీళ్లపై తీర్పు వచ్చిన కేసుల్లో 93 శాతం మంది తిరిగి అర్హులేనని తేలినా.. వారు ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారని రావత్‌ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాల్సిందేనని, అయితే ఆ ప్రక్రియలో ఓటు హక్కు కోల్పోయిన వారి పరిస్థితిపై స్పష్టత అవసరమని అన్నారు.

ప్రజలకు సమాధానం చెప్పాలి

సర్ వివాదంతో ఎన్నికల సంఘంపై ఉన్న నమ్మకానికి దెబ్బ తగిలిందని రావత్‌ పేర్కొన్నారు. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు భారత ఈసీని ‘గోల్డ్‌ స్టాండర్డ్‌’గా పిలిచేవారని గుర్తుచేశారు. ప్రస్తుత అనుమానాలకు తెరదించేందుకు ముగ్గురు ఎన్నికల కమిషనర్లు కలిసి ప్రజల ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడించాలని సూచించారు. ప్రజలే రాజ్యాంగ వ్యవస్థకు అసలు అధిపతులని చెబుతూ, ఎన్నికల జాబితా సవరణలో ఓటు హక్కు కోల్పోయిన వారి సమస్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

 

#OPRawat #FormerCEC #SIR #SpecialIntensiveRevision #ElectionCommission #GyaneshKumar #SukhbirSinghSandhu #VivekJoshi #Form6 #VoterRights #VoterList #WestBengalSIR #ElectoralRoll #ElectionNews #IndianDemocracy