రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చన్న ప్రభుత్వం
తక్షణమే ఆదేశాలు అమలకు చర్యలు
అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు ఇచ్చిన మాట మేరకు 22-ఏ భూముల సమస్యలకు వేగంగా పరిష్కారాలు చూపిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. న్యాయబద్ధమైన ఒక్క సెంటు భూమి విషయంలోనూ ప్రజలకు ఇబ్బంది కలిగించలేదని, భవిష్యత్‌లోనూ అలాంటి పరిస్థితి ఉండదని స్పష్టం చేసింది. 22-ఏ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ సంస్థల అనుమతులు పొందిన ఆస్తులకు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. చట్టబద్ధమైన అనుమతులతో అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్లను నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలు
దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న 22-ఏ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. జిల్లా స్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా రిజిస్ట్రార్, హెచ్ఎండీఏ, పురపాలక, గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను కమిటీలు పరిశీలించి పరిష్కరించనున్నాయి.
పెండింగ్ సమస్యలకు పరిష్కారాలు
22-ఏ సమస్యల పరిష్కారంలో ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం ఉదాహరణగా చూపింది. రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాల్లోని దాదాపు 64 కాలనీల ఇళ్ల క్రమబద్ధీకరణకు జీవో 118 ప్రకారం మెమో జారీ చేసింది. అలాగే దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న సింగరేణి కార్మికుల ఇళ్ల క్రమబద్ధీకరణకు జీవో 76 ద్వారా పరిష్కారం చూపే దిశగా నిర్ణయం తీసుకుంది. భూమి, ఇళ్ల సమస్యలపై ప్రజలు సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి ముగింపు పలకడమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.











