రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి సంక్షేమం లేదని, ఎక్కడ చూసినా కేవలం కూల్చివేతలే జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. దండుపాళ్యం ముఠాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయితే, ఇక్కడి మంత్రులు ఆయనను మించిపోయారంటూ దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం వెంకటగిరిలో జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించారని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తిరిగి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రుల అవినీతి వ్యవసాయం కరువు
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధి పూర్తిగా సున్నా అని కేటీఆర్ విమర్శించారు. దాచుకోవడం, దోచుకోవడం తప్ప జిల్లా ప్రజలకు వారు చేసిందేమీ లేదన్నారు. ఒక మంత్రి భూముల కబ్జాలకు పాల్పడుతుంటే, మరో మంత్రి వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారన్నారు. రాష్ట్రంలో రైతులకు కనీసం యూరియా ఇచ్చే పరిస్థితి కూడా లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలోనే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని, కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ దందాలకు పాల్పడుతున్నారంటూ దానికి సంబంధించిన వీడియో దృశ్యాలను సభా వేదికపై ప్రదర్శించారు. కేసీఆర్ చేసిన అప్పులు కాళేశ్వరం, భక్త రామదాసు ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర సంక్షేమం కోసమేనని స్పష్టం చేశారు.
సర్ ప్రక్రియపై కార్యకర్తల అప్రమత్తత
త్వరలో ప్రారంభం కాబోతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు చాలా అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. ఈ నెల 25 నుండి వచ్చే నెల 25 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఒక్క ఓటు కూడా జాబితా నుండి తొలగించబడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి బూత్ స్థాయి కార్యకర్తపై ఉందన్నారు. నిజాయతీగా ఎన్నికలు జరిగితే కేసీఆర్ వంద సీట్లతో గెలుస్తారని, అందుకే అర్హులైన ఓటర్ల పేర్లు కాపాడాలని దిశా నిర్దేశం చేశారు. డిజిటల్ సభ్యత్వ నమోదులో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.










