Home National_news ఛాత్రోన్ కీ గూంజ్’ కాదు ‘పైసే కీ గూంజ్’

ఛాత్రోన్ కీ గూంజ్’ కాదు ‘పైసే కీ గూంజ్’

పైసలిచ్చి తెచ్చుకుంటున్నారు.
రాహుల్ సభ మనీ షో అంటూ విమర్శలు.

పుణెలో రాహుల్ గాంధీ నిర్వహించిన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ సభకు జనాన్ని సమీకరించేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు డబ్బులు చెల్లించిందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ మహారాష్ట్ర అధికార ప్రతినిధి నవనాథ్ బన్ మాట్లాడుతూ.. ఒక్కో ఇన్‌ఫ్లూయెన్సర్‌కు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు చెల్లించేందుకు ఆఫర్లు ఇచ్చిన వీడియోలు బయటకు వచ్చాయని పేర్కొన్నారు. ప్రయాణ ఖర్చులు భరించడంతో పాటు కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి ఈ మొత్తాలు ఇస్తున్నారని ఆరోపించారు. సుమారు 3 వేల మందికి ఇలాంటి చెల్లింపులు జరిగితే రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చు అవుతుందని బీజేపీ లెక్కలు చెప్పింది. అందుకే కార్యక్రమాన్ని ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కాకుండా ‘పైసే కీ గూంజ్’గా బీజేపీ అభివర్ణించింది.

డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్న

ఈ నిధులకు మూలం ఏమిటో తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. డబ్బు ఎవరి నుంచి వచ్చింది.. ఎవరి ద్వారా పంపిణీ చేశారు.. అధికారిక ఖాతాల్లో ఈ మొత్తాల వివరాలు ఉన్నాయా అనే ప్రశ్నలను బీజేపీ నేతలు లేవనెత్తారు. విదేశీ నిధులతో సంబంధం ఉందా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంట్రాక్టులు, కమీషన్లు లేదా ఇతర ఆర్థిక లావాదేవీల ద్వారా నిధులు మళ్లించారా అనే అంశాలపైనా విచారణ జరగాలని కోరారు. బీజేపీ నేత కేశవ్ ఉపాధ్యాయ్.. విద్యార్థుల సమస్యల పేరుతో రాహుల్ గాంధీ రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్‌కు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై స్పష్టమైన రాజకీయ అంశం లేదని ఆరోపించారు.

యువత మద్దతుపైనే అసలు పోరా?

బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ నేత సచిన్ సావంత్.. రాహుల్ గాంధీకి యువత, ముఖ్యంగా జెన్‌జీ నుంచి పెరుగుతున్న మద్దతును చూసే బీజేపీ భయపడుతోందని ఆరోపించారు. పుణె కార్యక్రమానికి ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిందని, విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఎన్‌సీపీ (ఎస్‌పీ) నేత మహేశ్ తపాసే కూడా బీజేపీపై మండిపడ్డారు. విద్యార్థులు, యువత సమస్యలపై చర్చించేందుకు నిర్వహించే కార్యక్రమాన్ని చూసి బీజేపీ ఎందుకు ఆందోళన చెందుతోందని ప్రశ్నించారు.

#RahulGandhi #ChhatronKiGoonj #PaiseKiGoonj #BJP #Congress #Pune #MaharashtraPolitics #RahulGandhiEvent #PoliticalControversy #InfluencerPayments #CongressEvent #BJPvsCongress #GenZ #YouthPolitics #IndianPolitics #PoliticalNews