తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పార్టీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ పదవులకు వయోపరిమితి, పదవీకాల పరిమితిని అమలు చేయాలని నిర్ణయించారు. పార్టీ ఓటమికి పలు కారణాలు ఉన్నా, పదవుల్లో ఉన్న నేతల పనితీరు కూడా ఒక కారణమని స్టాలిన్ బహిరంగంగా అంగీకరించారు. వ్యక్తిగత తప్పిదం జరిగినా 75 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ నష్టపోతుందని ఆయన పేర్కొన్నారు. యువత, మహిళల్లో పార్టీపై నమ్మకాన్ని తిరిగి పెంచడమే లక్ష్యంగా కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. “డీఎంకే తిరిగి వస్తుంది.. గతానికి వడ్డీతో సహా సమాధానం ఇస్తుంది” అంటూ పార్టీని ‘కమ్‌బ్యాక్ స్పెషలిస్ట్’గా అభివర్ణించారు.
పదవులకు వయసు, టర్మ్ కట్
డీఎంకే 16వ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్రాంచ్ కార్యదర్శుల వయసు 45 ఏళ్లకు మించకూడదు. గరిష్ఠంగా రెండు టర్మ్‌లు మాత్రమే పదవిలో ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో కొత్త బ్రాంచ్ స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు బ్రాంచ్ కార్యదర్శి పదవిని కూడా తీసుకురానున్నారు. తొలిదశలో చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచిరాపల్లి, సేలం నగరాల్లో ఈ విధానాన్ని అమలు చేసి తరువాత ఇతర కార్పొరేషన్లకు విస్తరించే అవకాశం ఉంది. జిల్లా కార్యదర్శుల విషయంలో 70 ఏళ్లలోపు వయసు, గరిష్ఠంగా మూడు టర్మ్‌ల పరిమితి విధించారు. పదవుల్లో కొత్త వారికి అవకాశం కల్పించడం ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకురావాలని స్టాలిన్ భావిస్తున్నారు.
77 జిల్లాలు 110కి పెంపు
డీఎంకేలో అతిపెద్ద మార్పుగా పార్టీ జిల్లాల సంఖ్యను 77 నుంచి 110కి పెంచేందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. సాధారణంగా ఒక్కో రెవెన్యూ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్టీ జిల్లాగా ఉండేలా పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు. ఒక నియోజకవర్గం మాత్రమే మిగిలితే అదే రెవెన్యూ జిల్లాలోని మరో పార్టీ జిల్లాకు మూడో నియోజకవర్గంగా జత చేస్తారు. కొత్త 110 జిల్లాల పరిధిని స్టాలిన్ నిర్ణయించనున్నారు. కొత్త జిల్లాల ప్రకటన తర్వాత 15 రోజుల్లో యూనియన్, నగర, ఏరియా, టౌన్, వార్డు, బ్రాంచ్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వచ్చే 100 ఏళ్లకు పార్టీని బలంగా నిలబెట్టడమే ఈ సంస్కరణల లక్ష్యమని స్టాలిన్ తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని సంస్థాగతంగా డీఎంకేను పునర్నిర్మించేందుకు ఈ మార్పులు కీలకంగా మారనున్నాయి.
#DMK #MKStalin #DMKReforms #DMKRestructuring #TamilNaduPolitics #DMKOrganizationalChanges #DMKOrganizationalElection #Stalin #DMKYouth #DMKWomensLeadership #DMKDistricts #DMKPartyReforms #TamilNaduElection #DMKComeback #PoliticalNews











