Home Telangana వాటర్ ట్యాంకర్ వార్నింగ్ బెల్స్ మొదటి సారి రూ.5 వేల జరిమానా!

వాటర్ ట్యాంకర్ వార్నింగ్ బెల్స్ మొదటి సారి రూ.5 వేల జరిమానా!

రెండోసారి ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్ రద్దు.
నీటి వృథాపై జలమండలి కొరడా.
నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు.

హైదరాబాద్ నగరంలో వాటర్ ట్యాంకర్ల ద్వారా జరుగుతున్న నీటి వృథాను అరికట్టేందుకు జలమండలి కఠిన చర్యలకు సిద్ధమైంది. 2026 నవంబర్ 1 నుంచి నిబంధనలు ఉల్లంఘించే ట్యాంకర్లకు మొదటిసారి రూ.5 వేల జరిమానా విధించనున్నారు. రెండోసారి కూడా ఉల్లంఘనకు పాల్పడితే సంబంధిత ట్యాంకర్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనున్నట్లు జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. నీటి ప్రతి బొట్టును సంరక్షించడంతో పాటు రవాణాలో వృథాను అరికట్టడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.

లీకేజీలు ఉంటే నీటి సరఫరా నిలిపివేత

ట్యాంకర్లలో సామర్థ్యానికి మించి నీటిని నింపడం, రవాణా సమయంలో లీకేజీలతో నీరు వృథా కావడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ట్యాంకర్లకు మూతలు లేకపోయినా, ఉన్న మూతలను సరిగా బిగించకపోయినా ఫిల్లింగ్ స్టేషన్లలో నీటిని నింపేందుకు అనుమతించరు. లోపాలున్న ట్యాంకర్లకు మరమ్మతులు పూర్తయ్యే వరకు నీటి నింపుదలను నిలిపివేయనున్నారు. ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని జలమండలి అధికారులను ఆదేశించింది.

ఫిల్లింగ్ స్టేషన్లలో నిరంతర తనిఖీలు

నగరంలోని అన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో ట్యాంకర్ల పరిస్థితిని తనిఖీ చేయాలని ఎండీ సూచించారు. నీటిని నింపే ముందే లీకేజీలు, మూతల భద్రతను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం అధికారులు నిబంధనల అమలును నిరంతరం పర్యవేక్షించాలి. ఉల్లంఘనలకు పాల్పడే వాహనాలపై ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

యజమానులు, డ్రైవర్లకు స్పష్టమైన హెచ్చరిక

వాటర్ ట్యాంకర్ యజమానులు, డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని అశోక్ రెడ్డి సూచించారు. ట్యాంకర్ అసోసియేషన్లు తమ సభ్యులకు కొత్త నిబంధనలపై అవగాహన కల్పించాలని కోరారు. మొదటి ఉల్లంఘనకే జరిమానా.. రెండో ఉల్లంఘనతో రిజిస్ట్రేషన్ రద్దు కానుండటంతో ట్యాంకర్ల నిర్వహణపై పర్యవేక్షణ మరింత కఠినం కానుంది. నగరంలో నీటి వృథాను తగ్గించి, అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జలమండలి పిలుపునిచ్చింది.

 

#HyderabadWaterTankers #HMWSSB #WaterTankerRules #WaterWastage #5000Fine #WaterConservation #HyderabadNews #TelanganaNews #AshokReddy #WaterSupply #TankerRegistration #NewRules2026