ప్రభుత్వ గ్యారంటీ వెనుక అసలు లెక్కలేమిటి?
కంచ గచ్చిబౌలి ప్రభుత్వ భూమి తనఖా వెనుక కథేంటి..!?
ప్రజలకు తెలియాల్సిన డాక్యుమెంట్లు ఎందుకు కన్పించవు..!?
వేల కోట్ల రూపాయల రుణం.. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ.. హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి తనఖా! ఇంతటి భారీ ఆర్థిక వ్యవహారంలో ప్రజలకు తెలియాల్సిన కీలక పత్రాలు మాత్రం ఎందుకు అందుబాటులో లేవు? తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్న ఇదే. పరిశ్రమలు–వాణిజ్య శాఖ జారీ చేసిన G.O.Ms.No.24 ద్వారా TSIICకు ₹10,000 కోట్ల వరకు బాండ్ల రూపంలో నిధులు సమీకరించేందుకు అనుమతి ఇచ్చినట్లు వివరాలు చెబుతున్నాయి. అసలు, వడ్డీ చెల్లింపులకు ప్రభుత్వ గ్యారంటీ… రుణాలకు భద్రతగా వందల ఎకరాల భూమి.. భవిష్యత్తులో భూముల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంపై రుణదాతలకు ప్రాధాన్యత కల్పించే నిబంధనలు.. ఇవన్నీ కలిసి రాష్ట్ర ఆర్థిక బాధ్యతలపై కీలక చర్చకు తెరలేపుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైల్ నోటింగ్స్, తనఖా పత్రాలు, ట్రస్టీతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కోరుతూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా, కొన్ని పత్రాలను అంతర్గతమైనవి, మరికొన్నింటిని ప్రైవేటువిగా పేర్కొన్నారు. మరి ప్రభుత్వ గ్యారంటీకి సంబంధించిన వివరాలు ప్రజలకు ఎందుకు పూర్తిస్థాయిలో తెలియకూడదు? వాస్తవంగా ఎంత రుణం తీసుకున్నారు? చెల్లింపుల భారం ఎవరిపై పడుతుంది? 400 ఎకరాల భూమి విలువను ఎవరు నిర్ణయించారు? ప్రజా ఆస్తులు పణంగా ఉన్నప్పుడు పారదర్శకతకు తాళం ఎందుకు? ఈ ప్రశ్నల వెనుక ఉన్న అసలు లెక్కలు, అధికారుల సమాధానం చెప్పాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి.
#KanchaGachibowli #Telangana #TSIIC #GovernmentLand #TelanganaGovernment #10000Crore #GovernmentGuarantee #BondIssue #RTI #PublicAssetTransparency #TelanganaPolitics #FinancialAccountability











