యువ దర్శకులారా కదలండి!
ప్రజల్లో చైతన్య కలిగించండి .
యువ దర్శకులకు భట్టి పిలుపు .
విద్యుత్, నీటిని పొదుపుగా వినియోగించుకోవడంపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క యువ దర్శకులకు పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భవిష్యత్తులో ఎదురయ్యే నీటి సంక్షోభం వంటి అంశాలపై ఆకట్టుకునే కథలతో లఘు చిత్రాలు రూపొందించాలని సూచించారు. వినోదంతో పాటు సమాజానికి ఉపయోగపడే సందేశాలను అందించినప్పుడే సినిమాకు నిజమైన ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అవార్డ్స్–2026 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువత సృజనాత్మకతను అభినందిస్తూ, చిన్న చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్.. భారతీయ సినిమాకు ప్రధాన కేంద్రం
హైదరాబాద్‌ను భారతీయ సినిమా పరిశ్రమకు ప్రధాన కూడలిగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో తెలంగాణలో సినీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ యువతలో అపారమైన సృజనాత్మక ప్రతిభ ఉందని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే జాతీయ స్థాయిలో రాణించగలరని పేర్కొన్నారు. మూడు గంటల సినిమాలో చెప్పే కథను రెండు మూడు నిమిషాల షార్ట్‌ఫిల్మ్‌లో చెప్పడం కూడా గొప్ప సృజనాత్మకతేనని ప్రశంసించారు. ఈ పోటీలో అవార్డులు రానివారు నిరుత్సాహపడకుండా తమ ప్రయత్నాలను కొనసాగించాలని సూచించారు. 29 అవార్డుల ద్వారా యువ ప్రతిభను గుర్తించడం అభినందనీయమని తెలిపారు.
బతుకమ్మలో సామాజిక సమానత్వ సందేశం
బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. వివిధ రంగుల పూలు ఒకచోట చేరినట్లుగా భిన్న వర్గాల ప్రజలను ఏకం చేసే పండుగగా బతుకమ్మను అభివర్ణించారు. ఇది సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు, సూపర్ ఎల్‌నినో ప్రభావాలు, వర్షపాతంలో మార్పులు ప్రజల జీవితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. నీటి వనరుల సంరక్షణ, వర్షపు నీటి వినియోగం, ప్రకృతి పరిరక్షణపై ప్రజలకు అర్థమయ్యే కథలతో షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందించాలని యువ దర్శకులను కోరారు. విద్యుత్ పొదుపు, నీటి సంరక్షణను ప్రజల బాధ్యతగా మార్చడంలో కళాకారులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
#BhattiVikramarka #YoungFilmmakers #WaterConservation #EnergySaving #Bathukamma #ShortFilms #ClimateChange #RainwaterHarvesting #TelanganaCinema #HyderabadFilmIndustry #EnvironmentalAwareness #TelanganaNews











