ప్రత్యామ్నాయ పంటలు మేలు.
రైతులు అప్రమత్తం కావాలి.
నీరు, కరెంటు కష్టాలు తప్పవు.
ఎల్‌నినో కోవిడ్ తరహా సంక్షోభం.
కరువు కాంగ్రెస్ వల్లేనా?
బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ ఎదురుదాడి.
తెలంగాణలో రాబోయే యాసంగి సాగుపై ఎల్‌నినో ప్రభావం పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నీటి లభ్యత తగ్గడంతో పాటు విద్యుత్ కొరత కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని, రైతులు ముందస్తుగా అప్రమత్తం కావాలని సూచించారు. ఎల్‌నినోను కోవిడ్ తరహా సంక్షోభంగా అభివర్ణిస్తూ, పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలని రైతులకు సూచించారు. కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎల్‌నినో ప్రభావం భారత్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో కనిపిస్తోందని, ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ ఈ పరిస్థితి ఉన్నప్పుడు తెలంగాణలో కరువుకు కాంగ్రెస్ కారణమని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు.
కృష్ణా జలాలపై బీఆర్‌ఎస్‌కు సవాల్
తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపుల విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 2015లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 515 టీఎంసీల కేటాయింపులపై ఎవరు సంతకం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ముందు మోకరిల్లి తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెట్టారని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఎస్‌ఎల్‌బీసీ, డిండి, సీతారామసాగర్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. సాగునీటి ప్రాజెక్టులపై రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసి, రూ.40 వేల కోట్ల బకాయిలు మిగిల్చారని విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు.
యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టుపై ప్రశ్నలు
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరగడంపై సీఎం పలు ప్రశ్నలు లేవనెత్తారు. తొలుత రూ.17,950 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.37,781 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. దిగుమతి బొగ్గు ఒప్పందాలు, సింగరేణి బొగ్గు వినియోగంపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. సింగరేణి, ఎన్‌టీపీసీ ప్లాంట్లలో యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రూ.4.29 నుంచి రూ.4.63 వరకు ఖర్చవుతుండగా, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మాత్రం ఏకంగా రూ.6.66 వ్యయమవుతోంది. అంటే ఇతర ప్లాంట్లతో పోలిస్తే యాదాద్రిలో యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రూ.2కు పైగా అదనపు ఖర్చు అవుతోందని సీఎం చెప్పారు. ఈ వ్యత్యాసం వల్ల రాబోయే 25 ఏళ్లలో భారీ ఆర్థిక భారం పడుతుందన్నారు. యాదాద్రిలో దేశీయ బొగ్గునే వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నామని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోనూ మాట్లాడినట్లు తెలిపారు.
ఫామ్‌హౌస్ నీళ్లపై విచారణకు సిద్ధమా?
కొండపోచమ్మ నుంచి పంచపాండవుల చెరువుకు కాలువ తవ్వి, అక్కడి నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోని 400 ఎకరాలకు నీరు అందిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేద్దామని సవాల్ విసిరారు. మరోవైపు, దిగుమతి బొగ్గు ఒప్పందాలపై కేటీఆర్ లేఖ ఆధారంగా ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, బొగ్గు కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్నది తన ఆరోపణగా పేర్కొంటూ, దీనిపై బహిరంగ విచారణకూ సిద్ధమన్నారు. ప్రభుత్వం మీద బురదజల్లడం కంటే గత పాలనలోని నిర్ణయాలపై చర్చకు రావాలని బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు.
#RevanthReddy #TelanganaFarmers #Yasangi #PaddyCultivation #ElNino #AlternativeCrops #TelanganaPolitics #BRS #Congress #KrishnaRiverWaters #YadadriThermalPower #TelanganaAgriculture











