మొదలైన ఈసీ కసరత్తు, పర్యటనలు.
పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలను వేగవంతం చేసింది. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ వారంలో గోవాలో ఈసీ బృందం పర్యటించనుండగా, వచ్చే వారం ఉత్తరాఖండ్‌కు వెళ్లనుంది. అనంతరం పంజాబ్, మణిపూర్‌లో కూడా అధికారులు పర్యటించనున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఈసీ అధికారులు ఎప్పుడు పర్యటిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లతో కూడిన పూర్తి కమిషన్ ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తుంది.
2027 ఎన్నికలకు ముందస్తు కసరత్తు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది మే 22తో ముగియనుంది. 60 స్థానాల మణిపూర్, 40 స్థానాల గోవా, 117 స్థానాల పంజాబ్, 70 స్థానాల ఉత్తరాఖండ్ అసెంబ్లీల పదవీకాలాలు 2027 మార్చిలో వేర్వేరు తేదీల్లో ముగియనున్నాయి. నిబంధనల ప్రకారం అసెంబ్లీ పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఎన్నికల సంఘానికి ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ముందస్తు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన యంత్రాంగం, సిబ్బంది, భద్రతా ఏర్పాట్లపై ఈసీ దృష్టి పెట్టింది.
ఈవీఎంలపై కీలక తనిఖీలు
ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, గోవాలో ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాల ఫస్ట్ లెవల్ చెకింగ్ ప్రారంభమైంది. బీఈఎల్, ఈసీఐఎల్ సంస్థల ఇంజినీర్లు యంత్రాల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయా లేదా పరిశీలిస్తున్నారు. లోపాలు కనిపించిన యంత్రాలను మరమ్మతులు లేదా మార్పిడి కోసం తయారీ సంస్థలకు పంపిస్తారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తారు. గత ఎన్నికలకు సంబంధించిన డేటాను పూర్తిగా తొలగించిన తర్వాత పరీక్షల్లో ఉత్తీర్ణమైన యంత్రాలకు ‘ఎఫ్ఎల్సీ ఓకే’ గుర్తింపు ఇచ్చి ప్రత్యేక పింక్ సీల్‌తో భద్రపరుస్తారు. సాధారణంగా ఒక ఈవీఎం వ్యవస్థలో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ ఉంటాయి.
#AssemblyElections2027 #UPAssemblyElections #UttarPradeshElections #GoaElections #PunjabElections #UttarakhandElections #ManipurElections #ElectionCommission #ECI #EVM #VVPAT #EVMFLC #ElectionPreparation #IndiaElections #StateElections











