విజయవాడ రైతుబజార్లలో విక్రయం.
ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యుడి వంటింటి బడ్జెట్ తారుమారవుతోంది. కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70 వరకు పెట్టి కొనాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఇప్పటికే భారంగా మారిన వేళ ఉల్లి ధర కూడా పెరగడంతో కుటుంబ ఖర్చులు మరింత పెరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రతిరోజూ వంటలో తప్పనిసరిగా ఉపయోగించే ఉల్లిపాయ ధర ఇలా పెరగడం పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం మోపుతోందని వినియోగదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదలకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
విజయవాడలో రూ.35కే కిలో ఉల్లి
బుధవారం నుంచి విజయవాడలోని అన్ని రైతు బజార్లలో కిలో ఉల్లిని రూ.35కే విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు చూపించి ఒక్క కుటుంబం నెలకు గరిష్ఠంగా 2 కిలోల ఉల్లి కొనుగోలు చేయవచ్చు. మార్కెట్ పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందని, నిత్యావసర ధరల పెరుగుదలతో ప్రజలపై పడే అదనపు భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు తెలిపారు. విజయవాడలో ప్రజల స్పందన, డిమాండ్‌ను బట్టి రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకూ ఈ సబ్సిడీని విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.











