Home AP పుష్కరాలకు నిధులివ్వండి

పుష్కరాలకు నిధులివ్వండి

గోదావరి-కావేరిపై కీలక ప్రతిపాదన.
ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ .

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, నీటి భద్రత, మౌలిక వసతులపై సీఎం చంద్రబాబు ఢిల్లీలో వరుస భేటీలతో కేంద్రం ముందు రాష్ట్ర అవసరాలను ఉంచారు. ప్రధాని మోదీతో సమావేశంలో గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై సాంకేతిక అధ్యయనం చేపట్టాలని కోరారు. గోదావరి వరద జలాల్లో సముద్రంలోకి వెళ్లే నీటిని వినియోగించి దక్షిణాది రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చే అవకాశాలను పరిశీలించాలని ప్రతిపాదించారు. ఈ అనుసంధానం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు ప్రయోజనం చేకూరుస్తుందని వివరించారు.

కరువు.. పోలవరం.. పుష్కరాలు

పోలవరం నిర్మాణం, పునరావాస పనుల పురోగతిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు.. 2027 గోదావరి పుష్కరాలకు ప్రత్యేక కేంద్ర సాయం అందించాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం లోటు ఏర్పడిందని వివరించారు. 2026 ఖరీఫ్‌లో 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు తెలిపారు. జూన్-ఆగస్టు మధ్య సాధారణ వర్షపాతంతో పోలిస్తే 53.4 శాతం లోటు నమోదైందని చెబుతూ రైతులకు ప్రత్యేక కేంద్ర సహాయం కోరారు. అమరావతి ఓఆర్ఆర్, విశాఖ మెట్రో, బీచ్ కారిడార్‌కు కేంద్ర అనుమతులు, నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

20,378 ఎకరాలు ఇవ్వండి

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీలో పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు కోరారు. 20,378 ఎకరాల ఉప్పు భూములను రాష్ట్రానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ భూములు పోర్టుల విస్తరణ, కనెక్టివిటీ రోడ్లు, రైల్వే లైన్లు, అనుబంధ పరిశ్రమలకు ఉపయోగపడతాయని వివరించారు. మిర్చి, పొగాకు, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు కేంద్ర సహకారం అందించాలని కోరారు. మార్కెట్ విస్తరణ, నాణ్యత ప్రమాణాలు, ప్రాసెసింగ్ సదుపాయాలకు తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఓఆర్ఆర్‌కు కేంద్రం అండ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశంలో 189 కిలోమీటర్ల అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణానికి పూర్తిస్థాయి సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. రాజధాని ప్రాంత భవిష్యత్ రవాణా అవసరాలకు ఈ ప్రాజెక్టు కీలకమని వివరించారు. పోలవరం వద్ద ఎడమ, కుడి గట్లను కలుపుతూ ఐకానిక్ వంతెన నిర్మాణానికి నిధులు, అనుమతులు ఇవ్వాలని కోరారు. బీచ్ రోడ్‌తో తీరప్రాంత నగరాలు, పోర్టులు, పర్యాటక కేంద్రాలకు మెరుగైన అనుసంధానం కల్పించవచ్చని వివరించారు. నీరు, రహదారులు, పోర్టులు, ఎగుమతులు.. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర సహకారం కోరుతూ చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగింది.

 

#ChandrababuNaidu #PMModi #GodavariCauveryLink #GodavariPushkaralu2027 #PolavaramProject #AndhraPradesh #APDevelopment #AmaravatiORR #VisakhapatnamMetro #NitinGadkari #PiyushGoyal #APPolitics