- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
- బండి సంజయ్‌కు కోట్ల ఆస్తులు ఎక్కడివి?
- కేటీఆర్‌తో చర్చకు రావాలని కౌశిక్ సవాల్
- సీఎం, కేంద్రమంత్రి మధ్య రహస్య ఒప్పందం
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి చెప్పినట్లే బండి సంజయ్ నడుచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సిన కేంద్ర మంత్రి, అందుకు భిన్నంగా ప్రతిపక్ష నేత కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డిని సంజయ్ ఒక్క మాట కూడా అనకపోవడం చూస్తుంటే వారి మధ్య ఉన్న రహస్య ఒప్పందం స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు.
ఆర్థిక వనరులపై ప్రశ్నల వర్షం
బండి సంజయ్ ఆర్థిక స్థితిగతులపై కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్నికల సమయంలో తన భార్య పుస్తెలు అమ్మి పోటీ చేశానని చెప్పుకున్న బండి సంజయ్‌కు, ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి బండి సంజయ్‌కు డబ్బులు అందుతున్నాయని, అందుకే ఆయన ప్రభుత్వంపై మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. కేటీఆర్‌ను విమర్శించే స్థాయి సంజయ్‌కు లేదని, దమ్ముంటే కేటీఆర్‌తో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తమ నాయకుడిని ఇష్టం వచ్చినట్లు దూషిస్తే చూస్తూ ఊరుకోబోమని, తగిన రీతిలో బుద్ధి చెబుతామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.











