Site icon Naa Desam

మార్కెట్ వింత

Wheat Prises

దేశవ్యాప్తంగా గోధుమల ధరలు పడిపోతుండటం అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది గోధుమ ఉత్పత్తి ఆశాజనకంగా ఉండటం, మార్కెట్‌కు పెద్ద ఎత్తున సరుకు రావడం, ప్రభుత్వ వద్ద సుమారు 2.2 కోట్ల టన్నుల నిల్వలు ఉండటంతో ధరలు గణనీయంగా తగ్గాయి. అనేక రాష్ట్రాల్లో రైతులు తమ పంటను కనీస మద్దతు ధర కంటే తక్కువకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. పండించిన కష్టానికి గిట్టుబాటు ధర లభించక ఒకవైపు రైతు నష్టపోతుంటే, ఆ ప్రయోజనం వినియోగదారుడికి మాత్రం అందడం లేదు.

మధ్యవర్తుల దోపిడీ – వినియోగదారుడిపై భారం
గోధుమల ధరలు తగ్గినప్పటికీ, మార్కెట్‌లో గోధుమ పిండి ధరలు మాత్రం ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. బ్రాండెడ్ కంపెనీలు ప్యాకేజింగ్, పంపిణీ ఖర్చుల పేరుతో పిండిని గరిష్ట ధరలకే విక్రయిస్తున్నాయి. మండీలలో గోధుమలు తక్కువ ధరకే లభిస్తున్నా, మాల్స్, రిటైల్ దుకాణాల్లో వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. అసంఘటిత రంగంలోని చిన్న మిల్లులు విద్యుత్, రవాణా ఖర్చుల భారాన్ని సాకుగా చూపుతున్నాయి. ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించడం, నిల్వలపై పరిమితులు పెట్టినప్పటికీ, క్షేత్రస్థాయిలో సామాన్యుడికి ధరల ఉపశమనం లభించడం లేదు. సేకరణ ప్రక్రియలో ఉన్న లోపాల వల్ల రైతు అయినకాడికి పంటను తెగనమ్ముకుంటుండగా, కార్పొరేట్ సంస్థలు మాత్రం భారీగా లాభపడుతున్నాయి.

Exit mobile version